Saturday, July 18, 2009

ఆడ-మగ తేడాలు

ఆడ-మగ తేడాలు.......

పిండానికి 6వారాలు నిండే వరకూ ఆడా, మగా అన్న సంగతి స్పష్టం గాదు. ఒకేలా కనిపిస్తుంది.ఆడ శిశువైతే ఎక్స్‌ ఎక్స్‌ క్రోమోజోములు, మగ అయితే ఎక్స్‌ వై క్రోమోజోములు శరీరంలోని ప్రతి కణంలోనూ ఉంటాయి. ఈ దశలోనే జననావయాల మాతృక కణజాలం ఏర్పడుతుంది. వై క్రోమోజోము ఆ కణజాలంలో వృషణాల నిర్మాణాన్ని ప్రేరేపిస్తుంది. వై క్రోమోజోము పని కేవలం వృషణాల ఏర్పాటు చేసే వరకే!

పిండాన్ని మగ శిశువుగా రూపొందించే మొత్తం బాధ్యతను వృషణాలు చేపడతాయి. వృషణాలు టెస్టోస్టెరాన్‌ అనే హార్మోన్‌ను ఉత్పత్తిచేస్తాయి. పురుషాంగం, బీజకోశాల సృష్టితో బాటు, సంతానోత్పత్తికి అవసరమైయ్యే శుక్రకణాలను ఉత్పత్తి చేసే కణజాల నిర్మాణాన్నీ టెస్టాస్టెరోన్‌ సహాయంతో వృషణాలు నిర్వహిస్తాయి. పిండంలో అప్పటికే స్త్రీ జననేంద్రియ భాగాలూ మొగ్గతొడిగి ఉంటాయి. వృషణాలు తమ ప్రభావంతో ఆ భాగాలను క్షీణింప జేస్తాయి. దీనిని బట్టి పురుషాధిక్యత పిండదశలోనే ప్రారంభ మవుతున్నట్టుగా మనకు అర్ధమవుతోంది. అది ప్రకృతి సహజమని భావించాల్సి వస్తోంది.

పురుషునికి వృషణాల వంటి జననావయం స్త్రీకి అండాశయం. అయితే పిండం మగ శశువుగా మారేందుకు వృషణాలు ముందుగా ఏర్పడినట్టుగా ఆడశిశువులో అండాశయాలు ముందుగా తయారుకావు. 18 వారాల తర్వాత ఏర్పడతాయవి. 40 రోజుల పిండానికి ఆపరేషన్‌ చేసి వృషణాలను తొలగించగా, అది ఆడామగా కాకుండా లింగరహితంగా మారుతుందని భావించిన పిండశాస్త్ర పరిశోధకులకు ఆ పిండం ఆడపిల్లగా పెరగటం నివ్వెరపరిచింది ! పిండంలో వృషణాల ఉత్పత్తి జరగకపోతే అది సహజంగానే ఆడశిశువుగా ఎదుగు తుందని ఋజువైంది.

మగ శిశువులు కాంతికి బాగా ఆకర్షితులౌతారు. కంటికి నదురుగా కనిపించే వస్తువులు వారిని ఆకట్టు కుంటాయి. (ఈ ప్రభావమే వారు పెద్దవారయ్యాక అందమైన ఆడవారి పట్ల తొలి చూపులోనే ఆకర్షితులవటం, వారిని మోహించటానికీ కారణంగా కనిపిస్తోంది).

ఆడ శిశువులు ధ్వని, వాసనల ప్రభావానికి వేగంగా ప్రతిస్పందిస్తారు. (కంఠస్వరాలు, వివిధ ధ్వనులను గుర్తుపట్టటం, పలు రుచులను విశ్లేషించే అంశాలలో మగవారి కంటే ఆడవారు నిపుణత కలిగిఉంటారు). మానవ ముఖాలను చూడగానే ఆడశిశువులు ఆనందంతో కేరింతలు కొడతారు. మగశిశువులు నవ్వి ఊరుకొంటారు. ( సంతోషం, దుఃఖం మొదలైన ఫీలింగ్స్‌ వ్వక్తం చేసే విషయంలో మగవారు ఆడవారిలా భోళాగా ఉండరు. గుంభనంగా,గంభీరంగా ఉంటారన్న సంగతి గమనార్హం).

బాల్యదశలో ఆడపిల్లల కంటే మగపిల్లలు ఎక్కువగా మరణిస్తారు. వ్యాధి నిరోధక శక్తి ఆ దశలో వారిలో తక్కువగా ఉంటుంది. రక్తనాళాల నిర్మాణం,హార్మోనుల తయారీ మగవారి కంటే ఆడువారిలో మెరుగ్గా, నాణ్యంగా ఉండటం వలన వ్యాధినిరోధక శక్తి వారిలో అధికంగాఉంటుంది. మగపిల్లలు ఎక్కువగా మరణిస్తే లోకంలో ఆడ జనాభా అధికంగా పెరిగి పోవాలి కదా! మరి అలా జరగటం లేదెందుకని.......?
ఎందుకంటే.......
ఆడువారి కంటే పురుష జననాలు ఎక్కువ ఉండేలా చేస్తూ ప్రకృతి స్త్రీ, పురుషుల నిష్పత్తిలో సమతుల్యత సాధిస్తోంది కాబట్టి!

No comments:

Post a Comment